కాకిని కాలజ్ఞాని అంటారు.. కాకి కావ్ కావ్.. అనుటలో అంతరార్థం ఏమిటి?

కాకిని కాలజ్ఞాని అంటారు... కాకి కావ్ కావ్.. అనుటలో అంతరార్థం ఏమిటి?

కాకి పేరు వినగానే సాదారణంగా చాలా మందికి జుగుప్స కలుగుతుంది. చిరాకు పడతారు. సాధారణంగా చాలామంది పట్టించుకోరు. ఇదీ కాకుల పట్ల మానవుల భావన. కానీ, ‘గ్రహించగలిగితే సృష్టిలోని ప్రతి అణువూ బోధన చేస్తుంది’ అన్న కవి వాక్కులోని పరమార్థం – కాకుల ప్రవర్తనను పరిశీలించిన వారికి తెలుస్తుంది.

కాకి ఒక నల్లని సాధారణ పక్షి దీన్ని సంస్కృతం లో వాయసం అంటారు. కాకులు సాధారణంగా అన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తాయి. వీటిని ఎవరూ ప్రత్యేకంగా పెంచరు. అయినా పెంపుడు ప్రాణుల్లాగా ఇళ్ల పరిసరాల్లోనే మెలగుతుంటాయి. భారతీయ పురాణాల్లో కాకులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇది శనిదేవుడి వాహనంగా పురాణాలు పేర్కొన్నాయి. ఈ కారణంగా కొన్నిచోట్ల వీటికి పూజలు సైతం చేస్తుంటారు.

ఒకసారి యముడు రావణుడి దుశ్చర్యలకు భయపడి కాకి రూపాన్ని ధరించాడట. అందువల్ల ఇతర దేవతలకు కొద్దో గొప్పో హాని కలిగినా అతడికి ఏ కాలేదట. అందుకు కృతజ్ఞతగా యముడు కాకులకు రెండు వరాలు ఇచ్చాడంటారు. అవేమిటంటే, యుముడు ప్రాణులన్నింటికీ రోగాలను, వాటి ద్వారా మరణాన్ని కలిగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అయినప్పటికీ తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించి రక్షణ పొంది నందువల్ల ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలేవీ రావని వరమిచ్చాడట యముడు.

యమ లోకంలో నరక బాధలను అనుభవించే వారి బంధువులు, అలా మరణించినవారికి సమర్పించే భోజనాన్ని (పిండ రూపంలో) కాకులు తిన్నప్పుడే నరక లోకంలోని వారికి తృప్తి కలుగుతుందనే మరొక వరాన్ని ఇచ్చాడట. అందువల్లనే ఈ నాటికీ పితృకర్మల సమయంలో కాకులకు పిండాలు పెడుతున్నారంటారు పౌరాణికులు.

కాకి అరుపులతో చాలామందికి చిరాకు కలుగుతుంది. కానీ ఆ అరుపుల్లోనే వేదాంత బోధన ఉందని ఒక కవి పద్యరూపంలో చమత్కారంగా చెప్పాడు. జీవితంలో ఏ క్షణాలూ సుస్థిరమైనవి కావు. అంతలోనే సమసి పోతాయి. సంపదలు, వాటివల్ల వచ్చే సుఖాలు స్థిరమైనవి కావు. అవి నశించిపోతాయి.

మేడలు, మిద్దెలు, అందాలు, ఐశ్వర్యాలు స్థిరమైనవి కావు. అవన్నీ కరిగి పోతాయి. దానికి ఉదాహరణ ఈ గోరీయే అని ఒక సుల్తాన్ గోరీమీద కూర్చుని కాకి అందరికీ బోధన చేస్తోంది’ అని ఒక కవి చక్కగా కాకి అరుపును సమర్ధించాడు.

కావు కావుమని అరిచే కాకి కూతను జీవిత సత్యాలను బోధించిన విధంగా చెప్పిన ఈ పద్యం చాలా ప్రసిద్ధి చెందింది. కాకి కి ఉన్న ఉపకార గుణం ప్రశంసించ దగ్గదంటారు మానవతా వాదులు.

అందరినీ మైమరపిస్తూ, గానం చేసే కోయిలకు తన గూటిలోనే జన్మనిస్తుంది కాకి అలాగే మానవుడిగా జన్మించి నందువల్ల అవసరమైనప్పుడు తమ సహజమైన మానవీయతను ప్రదర్శించడం కనీస ధర్మం అంటారు. తమకు దొరికిన కొద్దిపాటి ఆహారాన్నైనా అందరితోనూ పంచుకోవడానికే ప్రాధాన్యమిస్తాయి కాకులు.

ఆ క్రమంలోనే ఆహారం కనబడగానే ఆతృతగా మిగతా కాకులను రమ్మని పిలుస్తాయట అవి. ఈ గుణాన్ని చూసి ఐకమత్య భావనను, పంచుకునే అలవాటును పెంచుకోవాలంటారు. బోధకులు. కాకులు పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *