
నిత్య కర్మల్లో దానం ఒకటి. ఇచ్చి పుచ్చుకోవడాలు లోక సహజం. కానీ దానం అలాంటిది కాదు. దానం అనే పదానికి ‘మనస్ఫూర్తిగా ఇచ్చేది’ అని నిర్వచించాయి పురాణాలు. ఎవరికైనా దానం చేసేటప్పుడు మిక్కిలి శ్రద్దతో చేయాలి. దానంగా ఇస్తున్న వస్తువు మీద మమకారాన్ని దాత పూర్తిగా వదులుకోవాలి. తన సమర్థత, సంపదల స్థాయిని, స్వీకరించేవారి అర్హతలను దృష్టిలో ఉంచుకోవాలి. ఈ రెండూ లేకపోతే అపాత్రదానం అంటారు.
అర్హత కలిగినవారికే దానమివ్వాలి. దానానికి మోతాదు గానీ పరిమాణం గానీ ‘ఇంత ఉండాలి’ అనే నియమం లేదు. ఎదుటివారి అవసరాలు తీర్చడమే దానం ముఖ్య ఉద్దేశ్యం. ఉదాహరణకు దాహంతో అలమటించే వారికి గుక్కెడు నీళ్లు ఇస్తే ప్రయోజనం ఉంటుంది. అంతేగానీ ధనం విలువైంది కదా అని దాన్నిచ్చి దాహం తీర్చుకోవడానికి వినియోగించుకోమనడం దానం అనిపించుకోదు.
ఒకవేళ వ్యక్తి స్వయంగా హీనదశలో ఉన్నట్లయితే తాను భుజించడానికి లభించిన దానిలో నుంచి అర్ధ గ్రాసం అంటే- పిడికిట్లో సగమైనా దానంగా ఇవ్వాలి నాకున్నది ఇచ్చేస్తే రేపటికి ఎట్లా? అనే ఆలోచన లేకుండా దానం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. శాస్త్రప్రకారం దానం రెండు రకాలు. మొదటిది ‘పూర్తం’. రెండోది ‘ఇష్టం’.
ఒక వ్యక్తి దానం అతడు మరణించాక కూడా అనేక తరాలకి ఉపయోగపడేటట్లయితే… దాన్ని పూర్తం అంటారు. అంటే బావులు, చెరువులు లాంటివి తవ్వించడం, ఆరామాలు నిర్మించడం, భోజన సత్రాలు కట్టించడం, విద్య- వైద్య సదుపాయాలు కలిగించడం, రహదారికి ఇరువైపులా చెట్లు నాటించడం… లాంటివి తరతరాలకి ఉపయోగపడతాయి. కాబట్టి ఇలాంటి వాటిని ‘పూర్తం’ అంటారు.
రెండోది ఇష్టం. వ్యక్తి ఇష్టపూర్వకంగా వేరొకరికి ఇచ్చే ద్రవ్యం, వస్త్రాలు, అతిథి సత్కారాలు దీనికిందకి వస్తాయి.
‘దానమివ్వని వాడు ధన్యుండు కాడయా’ అన్న హితవచన అంతరార్థాన్ని అందరూ అర్థం చేసుకోవాలి… ఆచరించాలి. అలాగని తమకు పనికిరాని వాటిని, ఇతరుల అవసరాలు తీర్చని వస్తువులను ఇవ్వడం దానం అనిపించుకోదు.
అవసరం, అదను దాటిపోయాక ఇచ్చినా అది దానం కాదు. చేసిన దానం గురించి ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. అందుకే పెద్దలు ‘కుడి చేత్తో చేసిన దానం, ఎడమ చేతికైనా తెలియకూడదు’ అనేవారు ఇలాంటి దానాలు వ్యక్తికి అమితమైన పుణ్యాన్ని, గ్రహీతలకు సంతృప్తిని కలుగజేస్తాయి.